మొత్తం మహిళా లోకాన్నే అవమానిస్తున్నారు: కవిత
- అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న కవిత
- సమరయోధుల పెన్షన్లు అందించే ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్
- ఉద్యమకారులను గుర్తించే కమిటీలో మహిళకు స్థానం లేకపోవడంపై విమర్శ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నాటికి తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సంక్షేమంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
జూన్ 2న జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకల వేదికగానే తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, అలాగే అమరవీరుల కుటుంబాలకు సమరయోధుల పెన్షన్లు అందించే ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల గుర్తింపు కోసం ప్రభుత్వం వేసిన ప్రత్యేక కమిటీలో ఒక్క మహిళకు కూడా చోటు కల్పించకపోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఉద్యమంలో క్రియాశీలంగా పోరాడిన సమస్త మహిళా లోకాన్ని అవమానించడమేనని మండిపడ్డారు.
కేవలం కమిటీలతో కాలయాపన చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటేనని, ఒకవేళ జూన్ 2 లోపు ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టకపోతే ఉద్యమకారుల సంఘాలతో కలిసి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, వారిని గౌరవించేందుకు సూచనలు చేసేలా రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే జీఓ నంబర్ - 679 ద్వారా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కె.కేశవరావు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, రాములు నాయక్, శోభన్ రెడ్డి కమిటీ సభ్యులుగా ఉన్నారు.